శ్రీరామ నవమి విశిష్టత,రామ శబ్దార్దం

హిందువుల నమ్మకం ప్రకారం ఈ లోకంలో అన్యన్య దాంపత్యమంటే సీతారాములదే… కల్యాణమంటే సీతారాములదే.   దాంపత్యానికి దివ్యత్వాన్ని ఆపాదించింది ఈ జంటే. భార్యాభర్తల అనురాగానికి, అనుబంధానికి ప్రేమకు నిర్వచం ఇచ్చింది కూడా సీతారాములే. అందుకే సీతారాముల కల్యాణాన్ని హిందువులు జగత్కళ్యాణంగా  భావిస్తారు. ప్రతీ దంపతులు సీతారాముల్లా జీవించగలిగితే ధార్మికతతోపాటు సుఖశాంతులతో వర్ధిల్లుతారని చెప్తూంటారు. అదే నిజం కూడా.
శ్రీరాముడు వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు.   శ్రీరాముడు జన్మించిన రోజుతో పాటు, శ్రీ సీతారాముల కళ్యాణం, అయోధ్యలో పట్టాభిషేకం చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినట్లు మనకు  పురాణాలు ద్వారా తెలుస్తోంది. అందుకే ఆ రోజుని పురస్కరించుకుని ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి రోజు హిందువులు శ్రీరామ నవమి ఎంతో వైభవంగా జరుపుకుంటాము.
‘రామ’ యనగా రమించుట అని అర్ధం. అనగా భగవంతుడుతో మనసా,వాచా కలిసిపోవటం అని పరమార్దం. మానవులకు ‘రామనా స్మరణ’ జ్ఝానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీరామ నవమి నాడు రామునికి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు. నవరాత్రి ఉత్సవాలను 9 రోజులపాటు జరుపుతారు. ఉత్సవ మూర్తుల ఊరేగింపు వేడుకగా నిర్వహిస్తారు.  రామాయణ పారాయణం చేస్తారు.