తింటే గారెలు తినాలి..వింటే ఉషశ్రీ రామాయణం వినాలి

తెలుగు పాఠకులలో ఉషశ్రీగారి పేరు తెలియనివారు ఉండరు. వారు ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు భారత, రామాయణ, భాగవతాలను ప్రతి వారం సీరియల్‌గా చెపుతూ, అశేష తెలుగు శ్రోతలను ఉర్రూతలూగించారు. ఈ కావ్యాలని పాఠక లోకానికి అందించాలనే సంకల్పం ఆ సమయంలోనే మాకు కలిగింది. పురాణాలను పుక్కిట పట్టిన సాహితీ ద్రష్ట  ‘గళగంధర్వుడు’ ఉషశ్రీ గారు. ఎంత క్లిష్టమైన విషయాన్ని అయినా  తేట తెలుగులో మరియు సరళవచనంలో చందమామ కథల్లాగ పిల్లలు, పెద్దలు అందరూ అర్దం చేసుకునే విధంగా చెప్పటం ఆయనకు అలవాటు.  ఆయన  అనుగ్రహించిన  రామాయణం, భారత, భాగవతం, భగవద్గీత మరియు సుందరకాండలు తెలుగు వారి జీవితాల్లో ప్రత్యేక స్దానం పొందాయనటంలో సందేహం లేదు. అన్నిటికన్నా ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది ఉషశ్రీ రామాయణం.  ఆదికవి వాల్మీకి నుంచి నేటివరకు రమణీయమైన రామకథ పలుభాషలలో, పలురీతులలో రూపుదిద్దుకుంటూ, భారతావనిలోనే కాకుండా భారతీయుల సంస్కృతి ప్రసరించిన అన్యదేశాలలోనూ ప్రచార ప్రశస్తి పొందుతూ వస్తోంది. అయితే ఎవరెన్ని వ్యాఖ్యానాలు చెప్పినా, ఎన్ని ఉపకథలు కూర్చినా, ఉషశ్రీ రామాయణం తీరే వేరు…సులభసుందరాలూ, భక్తి రసబంధురాలూ అయిన వాక్యాలతో సాగిన ఉషశ్రీ రామాయణం అప్పట్లో ఆకాశవాణి శ్రోతల నెందరెందరినో ఆకర్షించింది. ఆ తర్వాత ఇటువంటి అత్యుత్తమ భక్తిసాహిత్యాన్ని అందరికీ అందజేయాలని సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానములు ఈ గ్రంధాన్ని ప్రచురించింది.ఆ పుస్తకం సైతం ఎందరి ఇళ్లల్లోనో నిత్య పారాయణ గ్రంధంగా మారింది.  రామాయణం చదవడంవల్ల తల్లిదండ్రులపట్ల భక్తి, సోదరప్రీతి, జ్యేష్టానువర్తనం, లోక మర్యాదానుసరణం, ప్రతిజ్ఞాపాలనం, ఆశ్రితవాత్సల్యం, స్వామికార్యనిర్వహణం, స్వార్థపరత్వనివృత్తి, చిత్తశుద్ధి, పరోపకారబుద్ధి వంటి అనేక సద్గుణాలు అలవడడానికి అవకాశం ఉన్నదని ఆయన చెప్తూండేవారు. 

అదే విధంగా భద్రాచల సీతారాములవారి కల్యాణానికి ఆయన చేసిన  ప్రత్యక్ష వ్యాఖ్యానం కూడా బహుళ ప్రాచుర్యంలోకి వొచ్చింది.  శ్రీరామ నవమి పూట ఆ మహానుభావుడుని మనసారా తలుచుకోవటం,తలుచుకోవాలనే ఆలోచన రావటమూ మన పూర్వ జన్మ సుకృతమే..కాదంటారా